Amaravati, Oct 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు (Police Commemoration Day 2020) నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) పాల్గొన్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita), సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ (DGP Sawang) ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు గంటపాటు సాగిన సీఎం ప్రోగ్రాంకి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని తెలిపారు. నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని, సంఘ విద్రోహులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని చెప్పారు. ‘దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు. కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు.
Here's AP CMO Tweet
On the ocassion of #PoliceCommemorationDay, Hon'ble Chief Minister @ysjagan paid tributes to the valiant police personnel who lost their lives in the line of duty, at the Police Martyrs Memorial, Indira Gandhi Municipal Stadium, Vijayawada. pic.twitter.com/kLFpP5Leu6
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 21, 2020
రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్‌స్టేషన్లను తీసుకొచ్చాం. దిశా బిల్లును కేంద్రాని కూడా పంపించాం. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తాం. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తాం. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తాం’అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారు. కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం రూ.50లక్షలు ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల జీతాల పెంపులాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దిశా లాంటి చట్టాలు తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాం. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. సవాళ్లు ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని డీజీపీ అన్నారు.
హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని, మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ సేవా యాప్ కూడా తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు.