CM YS Jagan Review: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే, రాష్ట్ర చరిత్రలో రోడ్లకు ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదని తెలిపిన ఏపీ సీఎం జగన్, విశాఖ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైదిగా నిలిచేలా ప్లాన్ రూపకల్పన
CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, Feb 14: రోడ్లు, భవనాల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర‍్వహించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి సమీక్ష (review meeting with Roads and Buildings Department) నిర్వహించిన సీఎం జగన్‌.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు.

ఇప్పటివరకూ 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలపగా, నెలఖరు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్‌ పి సీతారామాంజనేయలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న సీఎం.. తర్వాత వర్షాలు బాగాపడ్డంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై సీఎం (AP CM YS Jagan) మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదని సీఎం తెలిపారు. ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా రోడ్లకు ఇంత డబ్బు ఇవ్వలేదు, ఖర్చు చేయలేదని సీఎం అన్నారు. రోడ్లను పూర్తిచేయడానికి సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు.

ఏపీ హైకోర్టులో కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం, కార్యక్రమాన్ని నిర్వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతుపనులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. 33 ఆర్వోబీలు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి – భోగాపురం – తిరిగి ఎన్‌హెచ్‌–16కు అనుసంధానం అయ్యే బీచ్‌ కారిడార్‌ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.

ఈ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలన్న ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్‌ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకోవాలి, అలాగే ఎయిర్‌ పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలని..ఆ విధంగా రోడ్ల రూపకల్పన జరగాలని సీఎం తెలిపారు. దీంతోపాటు ఈ రహదారిని అనుకుని టూరిజం ప్రాజెక్టులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే

రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రానుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా చెన్నై–సూరత్‌ కారిడార్‌కు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఇటీవల ఆమోదం తెలిపింది. దేశంలో తూర్పు, పశ్చిమ పోర్టులను అనుసంధానించే ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో 320 కి.మీ. ఏపీలో నిర్మించనున్నారు. మొత్తం రూ. 50 వేల కోట్ల అంచనాతో ఆమోదించిన ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పడనుంది. మరోవైపు చెన్నై–విశాఖపట్నం, ముంబై–ఢిల్లీ కారిడార్‌లతో కూడా దీనిని అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించడం రాష్ట్రానికి మరింత ఉపయుక్తంగా మారనుంది.

దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాలో వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు చెన్నై–సూరత్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి సూరత్‌కు నెల్లూరు, హైదరాబాద్, షోలాపూర్, పుణెల మీదుగా వెళ్లాల్సి ఉంది. అలాగే రాయలసీమ నుంచి చిత్రదుర్గ, దావణగెరె, బెల్గాం, కొల్హాపూర్, పుణెల మీదుగా ప్రయాణించాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టుతో చెన్నై నుంచి మన రాష్ట్రంలోని తిరుపతి, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటకలో కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, నాసిక్‌ మీదుగా గుజరాత్‌లోని సూరత్‌ వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కానుంది.

దాంతో దక్షిణాది నుంచి సూరత్‌కు 350 కి.మీ. దూరం తగ్గడంతోపాటు 6 గంటల ప్రయాణ సమయం కలసి వస్తుంది. ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో తమిళనాడులో 156 కి.మీ., ఏపీలో 320 కి.మీ., తెలంగాణలో 65 కి.మీ., కర్ణాటకలో 176 కి.మీ, మహారాష్ట్రలో 483 కి.మీ., మిగిలినది గుజరాత్‌లో నిర్మించనున్నారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడం కోసం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. డీపీఆర్‌ ఖరారయ్యాక ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యం.