Amaravati, Sep 7: ఏపీ ప్రభుత్వం చిన్నారులతో పాటు బాలింతలు, గర్బిణీలు ఆరోగ్యంగా ఉంచాలని భావించి, పలు పథకాలను (YSR Sampoorna Poshana Schemes) అమల్లోకి తెచ్చింది. తాజాగా ఏపీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ (YSR Sampoorna Poshana Plus Scheme), వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను (YSR Sampoorna Poshana scheme) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని 55,607 అంగన్ వాడీల పరిధిలో రూ. 1863.11 కోట్ల వ్యయంతో 30,16,000 మంది అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది.
అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని (poshana scheme) అమలు చేయనున్నారు.
Here's YSRCP Party Tweet
#YSRSampoornaPoshana, A scheme costing ₹1,863.11 cr to provide nutritious food to 30,16,000 eligible women and children enrolled in 55,607 Anganwadis across the state. Hon'ble CM Sri @ysjagan to launch the programme today. pic.twitter.com/wYziuh5gtW
— YSR Congress Party (@YSRCParty) September 7, 2020
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం
రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు ఈ పథకం కింద అందజేస్తారు. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం
ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.