Nandyal, Nov 8: ఏపీలో విషాదాన్ని నింపిన కుటుంబం ఆత్మహత్య (Nandyal Family Suicide Case) ఘటనపై ఏపీ సీఎం వైయస్ జగన్ విచారణకు ఆదేశించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై తక్షణం విచారణ జరపాల్సిందిగా డీజీపీ సవాంగ్‌కు ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేశారు.
ఈ నెల 3వ తేదీన కర్నూలు జిల్లా కౌలూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14)లు ప్రాణాలు విడిచిన (Nandyal Family Suicide) విషయం విదితమే. కాగా ఆత్మహత్య చేసుకునే ముందు సలామ్, అతని భార్య నూర్జహాన్ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ సెల్‌ఫోన్‌ను ఇంట్లో పెట్టారు. కుటుంబ సభ్యులు ఆ ఫోన్‌ను పరిశీలిస్తున్న క్రమంలో సెల్ఫీ వీడియో శనివారం బయటపడింది.
అందులో నేనేం తప్పు చేయలేదు సార్. ఆటోలో జరిగిన దొంగతనానికి, నాకు సంబంధం లేదు. అంగట్లో జరిగిన దొంగతనంతో కూడా సంబంధం లేదు. పోలీసుల టార్చర్ భరించలేకున్నా సార్. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మా చావుతోనైనా మనశ్శాంతి కలుగుతుందని భావిస్తున్నా’మంటూ సలాం, నూర్జహాన్ కన్నీటి పర్యంతమవుతూ తమ పరిస్థితిని అందులో వివరించారు. దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో తీస్తుండగా.. అభం శుభం తెలియని చిన్నారులు సెల్‌ఫోన్ వైపు అమాయకంగా చూస్తూ కన్పించడం కంటతడి పెట్టిస్తోంది. తన కుమార్తె, అల్లుడు, మనుమళ్ల ఆత్మహత్యలకు సీసీఎస్ పోలీసులే కారణమని సలాం అత్త మాబున్నీసా అంటున్నారు. తమ అల్లుణ్ణి 8 రోజుల పాటు చితక బాదారని ఆమె ఆరోపించారు.
పోలీసులు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి.. పౌరులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హోం మంత్రి సుచరిత హెచ్చరించారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు.