AP CM YS Jagan | File Photo

Amaravathi, July 29: ఈ ఏడాదికి గానూ జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఏపి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ. 693.81 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. 2020-21 విద్యాసంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్  చెల్లింపులు గానూ ఈ మొత్తాన్ని సీఎం జగన్ ఈరోజు విడుదల చేశారు.

నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశ్యంతో జగనన్న విద్యా దీవెన పథకానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించే ఫీజులకు వినియోగించడానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ. 671.45 కోట్లు జమచేయగా, నేడు రెండో విడతగా దాదాపు రూ. 693.81 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా రూ. 5,573.11 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు ఇస్తోంది.

నిధుల విడుదల సందర్భంగా  సీఎం జగన్ మాట్లాడుతూ..  పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే, తల్లిదండ్రులు తమ ప్రతి అడుగులోనూ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. మన పిల్లలు బాగా చదవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటారు. ఇందుకోసమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. జగనన్న విద్యా దీవెన ద్వారా వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థుల భోజనం, వసతి కోసం వసతి దీవెన ద్వారా ఏటా రూ.20 వేలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి బాగా చదువుకొని, ఉన్నత స్థాయిలో ఉండాలనేది తన తాపత్రయం అని సీఎం జగన్ పేర్కొన్నారు. అప్పుడే పేద కుటుంబాల తలరాతలు మారుతాయన్నారు.

ఇదిలా ఉంటే, వైసీపీ ప్రభుత్వం పథకాల పట్ల రాష్ట్ర బిజేపి విమర్శలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం జగనన్న మయం అన్నట్లుగా ప్రతీ ప్రభుత్వ పథకానికి జగన్ పేరు పెట్టుకుంటున్నారని బీజేపి మండిపడింది. కరోనా కారణంగా కాలేజికి సెలవులు, స్కూలు లేవు, హాస్టల్స్ మూతపడినపుడు జగన్ మోహాన్ రెడ్డి వందల కోట్లు ఎందుకోసం పంచుతున్నారని బిజేపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.