COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 11కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్ద ప్రజల పడిగాపులు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి
AP Chief Minister CM YS Jagan Mohan Reddy | File Photo.

Amaravathi, March 27: కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మన వాళ్లను కూడా ఆనందంగా ఆహ్వానించలేని స్థితిలో ఉన్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అన్నారు.  రాష్ట్రంలో పాజిటివ్ కేసులు (COVID19 in AP) పెరుగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చే ప్రయత్నం చేయవద్దని సూచించారు. హైదరాబాద్ లో ఏపీ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని తెలంగాణ  సీఎం కేసీఆర్ తమకు పూర్తి హామి ఇచ్చారు,  కాబట్టి ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్త లాక్ డౌన్ 21 రోజులు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బుధ, గురువారాల నుంచి తమ సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే ఆంధ్రా - తెలంగాణ బార్డర్ (AP- TS Border) వద్ద ఏపీ పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు. ఎన్ని గంటలు సరిహద్దు వద్ద పడిగాపులు కాసినా, పోలీసులు మాత్రం వారిని రాష్ట్రంలోకి అనుమతించ లేదు. దీంతో కొన్ని చెక్ పోస్టుల వద్ద పోలీసులకు- ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గంటల కొద్దీ వేచి చూసినా పంపకపోవడంతో అసహనానికి గురైన కొంత మంది బార్డర్ నుంచి చొచ్చుకొని వెళ్లి ఎపీలోకి ప్రవేశించారు, దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని తిరిగి తెలంగాణలోకి తరిమి కొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి "ఎక్కడి వారు, అక్కడే ఉండాలి" అంటూ ప్రకటన చేశారు. సీఎం ప్రకటనతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది తమను లోపలికి అనుమతించని పోలీసులపైకి రాళ్లు రువ్వారు, ఈ క్రమంలో కొందమంది పోలీసులు గాయపడ్డారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. హైదరాబాదులో హాస్టళ్లు మూయవద్దని నిర్వాహకులకు తెలంగాణ మంత్రుల ఆదేశాలు

ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు గురువారం నాటికి 11కు పెరిగాయి. స్వీడన్ నుంచి విజయవాడ వచ్చిన మరొకరికి గురువారం పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, రాష్టంలో తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందన్న సీఎం, ఎక్కడికక్కడ వ్యాధి నియంత్రణ చర్యలు చేపడుతోందని చెప్పారు. దయచేసి ఎక్కడి వారు అక్కడే 3 వారాల పాటు అలాగే ఉండిపోతే కరోనా వైరస్‌ను అదుపు చేయగలమని జగన్‌ పేర్కొన్నారు. అత్యవసరమైతే 1902కు కాల్ చేస్తే ప్రభుత్వమే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.

కరోనావైరస్ పై చేస్తున్న పోరాటంలో ముందుంటున్న వైద్య సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటించాలి, ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని ఆచరించాలని జగన్ చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులను కోసమే 450 ఐసీయూ బెడ్స్ చొప్పున 4 ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ -19 క్వారైంటైన్ కోసం 200 పడకల ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదు. ప్రతి 2 లేదా 3 కి.మీ.లకు రైతు బజార్లను విస్తరిస్తున్నాము. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కొనుగోళ్ల కోసం బయటకు రావొచ్చు. పొలంలో పనికి వెళ్ళే రైతులు కూడా సామాజిక దూరం అనుసరించాలి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని పంచాయతీ రాజ్‌, మునిసిపల్‌ విభాగాలను సీఎం ఆదేశించారు. అందరూ సురక్షితంగా ఉండాలంటూ సీఎం జగన్ ఆకాంక్షించారు.