Eluru Mystery Disease: ఏలూరు మిస్టరీ వ్యాధి, నీటిలోనే సమస్య ఉందా? డిసెంబర్ 11న రానున్న ఎన్ఐఎన్ సైంటిస్టుల నివేదిక, ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
CM YS jagan Review Meeting (Photo-Twitter)

Eluru, Dec 9: ఏలూరులో వింత వ్యాధికి (Eluru Mystery Disease) కారణాలు ఇంకా అంతుచిక్కలేదు. క్షేత్రస్థాయిలో వైద్య నిపుణులు, న్యూట్రేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులు పరిశీలించారు. తాగునీటిలో సీసం, నికోలిన్ పదార్థాలు కలిసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యాధి పరిస్థితిపై ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో (AP CM YS Jagan Video Conference) మాట్లాడారు.

ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షూ శుక్లా, ఆర్డీవో పనబాక రచన, డీఎంహెచ్వో డాక్టర్ సునంద పాల్గొన్నారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) టీం సభ్యులు, పలు ప్రాంతాల నుంచి వైద్యనిపుణులు, సైంటిస్టులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు అయ్యారు. ఈ మేరకు ఏలూరులోని ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే సాంపిల్స్ సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం జగన్‌ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై త్వరగా నివేధిక ఇవ్వాలని కోరారు. శుక్రవారానికి ప్రాధమిక నివేదిక ఇస్తామని ఎన్ఐఎన్ సైంటిస్టులు తెలిపారు. అలాగే ఈ రోజు ఏలూరులో పర్యటిస్తున్న కేంద్ర వైద్య నిపుణులతో సీఎం జగన్‌ మాట్లాడారు. సాంపిల్స్ సేకరణ గురించి ఎయిమ్స్ నివేదిక గురించి చర్చించారు. ఇప్పటి వరకు అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి 585 మంది చేరగా.. 503 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంకా 72 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 32 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ,గుంటూరు తరలించారు.

మిస్టరీ వ్యాధిని కనిపెట్టేందుకు ఏలూరు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి బృందం, 475కు చేరుకున్న బాధితుల సంఖ్య, 332 మంది కోలుకుని డిశ్చార్జ్, బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్ధాలు

మరోవైపు ఏలూరు టూటౌన్‌లో మంత్రి ఆళ్లనాని పర్యటిస్తున్నారు. అస్వస్థత ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులను పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. గుంటూరు, రాజమండ్రి నుంచి స్పెషలిస్టులను రప్పించామని తెలిపారు. ప్రస్తుతం 72 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను తీసుకువచ్చామని, వారి పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందన్నారు.

ఇదిలా ఉంటే గత రాత్రికి కొత్త కేసులు రాలేదని రిలాక్స్ అవుతుండగానే బుధవారం ఉదయం మరో 10 కొత్త కేసులు రావడంతో మళ్లీ టెన్షన్ పెరిగింది. దీంతో కేంద్ర త్రిసభ్య కమిటీ ఏలూరుకు రానుంది. ఇప్పటికైతే ప్రాథమికంగా తాగునీరు కలిషితమే కారణమని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఏలూరులో అనేకమంది మున్సిపల్ నీళ్లు తాగడం మానేశారు. నీరు కలుషితమైందని, కలర్ కూడా మారిందని స్థానికులు చెబుతున్నారు.

ఏలూరు బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లో భారలోహాల అవశేషాలను ప్రాథమికంగా గుర్తించారు.ఈ విషయాన్ని మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్‌ డా. రాకేశ్‌ కక్కర్ తెలిపారు. సీసం, నికెల్ లోహాల కారణంగానే స్ఫృహ కోల్పోవడం, మూర్ఛ లక్షణాలు వచ్చినట్లు పేర్కొన్నారు. నీటి కాలుష్యమే కారణమై ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. అయితే ఈ భార లోహాలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మరో బృందం ఏలూరు వెళ్లినాట్లు ఆయన చెప్పారు.