Vizag, May 11: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ కు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. నగర మేయర్ హరివెంకటకుమారితో పాటు మంత్రి అమర్నాథ్, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు.. సీఎం జగన్‌కు ఆత్మీయ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు.
అనంతరం పీఎం పాలెం(పోతులమల్లయ్య పాలెం)లోని వైఎస్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్ స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్‌న్ సందర్శించి అసోషియేషన్ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగారు. వైఎస్సార్ క్రికెట్‌స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజీ ప్లేయర్స్‌తో ముచ్చటించారాయన. క్రీడల్లో మరింత రాణించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
అనంతరం ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం అక్కడి సిబ్బందితో ఆయన కాసేపు మాట్లాడి.. వాళ్ల విజ్ఞప్తి మేరకు గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం క్యాన్సర్ యూనిట్‌లోని రేడియేషన్ ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించారు సీఎం జగన్. అనంతరం ఆర్కే బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించారు. అక్కడి నుంచి ఏయూ కన్వెన్షన్ హాల్‌లో.. ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు సీఎం జగన్.