Hyderabad, September 24: నిన్న సోమవారం రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan) మరియు తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR)ల మధ్య హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ లో భేటీ జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంబంధించిన అంశాలపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. కాగా, వీరి భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఒక ప్రముఖ మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. "కేంద్రం చిన్న చూపు" అనే శీర్షికతో ప్రచురితమైన ఆ కథనంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇది కేవలం ఊహజనిత కథనం మాత్రమే, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే అజెండాగా నిన్నటి భేటి జరిగిందని, అందులో ఎలాంటి రాజకీయ అంశాలు మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాలేదని చెబుతూ, ఆ పత్రిక కథనం కేవలం ఉద్దేశ్యపూర్వకంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, దీనిని ఏపీ సీఎం కార్యాలయం ఖండిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 'సాక్షి' మీడియా పేర్కొంది. అయితే దీనిపై అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం నుండి ఎలాంటి సహాకారం అందడం లేదు, రక్షణశాఖకు సంబంధించిన భూకేటాయింపులు కూడా చేయడం లేదు, ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరి సరిగ్గా లేదు, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అని ఇద్దరు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా ఓ ప్రముఖ మీడియా తన కథనంలో పేర్కొంది. దీనిపై ఏపీ సీఎంఓ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సాక్షి మీడియా తెలిపింది.
కేసీఆర్- జగన్‌ల మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటి?
సోమవారం రోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ చర్చలో ముఖ్యంగా నదీ జలాల తరలింపు, తక్కువ భూసేకరణతో కృష్ణా- గోదావరి అనుసంధానం చేయడం, విద్యుత్ మరియు పోలీస్ శిక్షణకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా తరలించాలి, అలైన్ మెంట్ ఎలా ఉండాలి? రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగంపై చర్చించారు. దీనికోసం రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.
విద్యుత్ మరియు పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. తెలంగాణలో 18వేల మంది పోలీసులను ఒకే సారి నియమిస్తున్నందున అందులో 4వేల మందికి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణనివ్వాలని ఏపి సీఎంని కేసిఆర్ కోరగా అందుకు జగన్ సానుకూలంగా స్పందించారు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇక వీటితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద చర్చకు వచ్చాయి. 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన వీరి భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రధాన అజెండా మాత్రం నదీ జలాల వినియోగంపైనే చర్చ జరిగింది.