Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

Amaravati, April 10: ఏపీలో రోజు రొజుకు కరోనావైరస్ కేసులు (AP Corona Cases) తగ్గుముఖం పట్టినట్లే పట్టి పెరుగుతున్నాయి. మొన్న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఊపిరిపీల్చుకునే లోపు మళ్లీ కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Corona Positive Cases in AP) 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.

ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు (COVID-19 Deaths in AP) మరణించారు. ఇప్పటివరకు కర్నూలులో అత్యధికంగా 75 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 51, నెల్లూరులో 48, కృష్ణా జిల్లాలో 35, ప్రకాశం జిల్లాలో 38, కడప జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 20, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 13, తూర్పుగోదావరి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి.

కరోనావైరస్ రోగ నిరోధక శక్తికి 'జగనన్న గోరుముద్ద'

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బాధితుడు కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. బ్రిటన్‌ నుంచి తిరిగి వచ్చిన ఈ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 23న తిరుపతి జీజీహెచ్‌ ఎస్వీఆర్‌ఆర్‌ హాస్పిటల్‌లో చేరారు. ప్రోటోకాల్‌ ప్రకారం మూడుసార్లు జరిపిన టెస్టుల్లో నెగిటివ్‌గా తేలడంతో డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 10కి చేరింది.

గుంటూరులో (Guntur) తొలి మరణం నమోదు కావడంతో ఏపీ సర్కారు (AP Govt) అలర్ట్ అయింది. నరసరావుపేటలోని వరవకట్ట, రామిరెడ్డిపేటలో పరిధిలో మూడు కిలోమీటర్లను రెడ్‌ జోన్‌ గా ప్రకటించారు. పొన్నూరులో కూడా కరోనా కేసు వెలుగులోకి రావడంతో పట్టణంలోని శరాబ్‌ బజారుకు కిలోమీటర్‌ పరిధిలో రెడ్‌ జోన్‌గా ప్రకటించి రసాయనాలను పిచికారీ చేశారు.

రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న అధికారులు

రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులకు మర్కజ్‌ సదస్సుతో సంబంధం ఉండటంతో.. అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి (Delhi) వెళ్లొచ్చిన 1000 మంది ప్రయాణికులతో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన 2500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 7,155 మందికి పరీక్షలు నిర్వహించగా 348 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మర్కజ్‌ నిజాముద్దీన్ (Markaz Nizamuddin) సదస్సుకు వెళ్లివచ్చినవారి వల్లే కేసులు పెరుగుతుండటంతో అధికారులు వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విదేశీ ముస్లింలు గుంటూరు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సత్తెనపల్లిలోని ఓ మసీదులో దాక్కున్న 10మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు పంపించారు.వీసా నిబందనలు ఉల్లంఘించిన కజకిస్తాన్‌ వాసులపై కేసులు నమోదు చేశారు. ఆరోగ్య విపత్తు చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.