Amaravati, Sep16: ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,845 మంది కరోనా (AP Coronavirus) నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,97,376కి (AP Corona Updates) చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,06,879 టెస్టులు పూర్తయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,835 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,92,760కు చేరింది. కొత్తగా 64మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా చిత్తూరు 9, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం జిల్లాలో ఆరుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అనంతపురం, కడప, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారని, కర్నూలు 4, తూర్పుగోదావరి జిల్లాలో 3, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు వివిధ జిల్లాలో అత్యధికంగా నమోదైన కేసులు వివరాలు.. తూర్పుగోదావరి జిల్లాలో 1,421, పశ్చిమగోదావరి జిల్లాలో 1,051, ప్రకాశం 873 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనాతో చికిత్స పొందుతున్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బల్లి దుర్గాప్రసాద్.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996-98లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, 2009-14లో పీఏసీ మెంబర్‌గా సేవలు అందించారు. దుర్గాప్రసాద్ మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు