Amaravati, Mar 16: ఏపీలో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై ఏకంగా సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేైసిన సంగతి విదితమే.
ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
ఈ నేపథ్యంలో ఎస్ఈసీ రమేష్ కుమార్ (SEC Ramesh Kumar) పై సీఎం జగన్ (CM Jagan) తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు కోసమే ఎన్నికలు వాయిదా వేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండానే రమేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని జగన్ ఫైర్ అయ్యారు. దీనిపై రమేష్ కుమార్ కూడా వివరణ ఇచ్చారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body polls) యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ ( AP CS Neelam Sahni Letter) రాశారు. కరోనా వైరస్ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని వివరించారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిందని, కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను చేపట్టిందని లేఖ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపివుంటే కరోనాపై (Coronavirus) వాస్తవ నివేదికను అందించేవాళ్ళం. వైద్య శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన నివేదికను కూడా పంపించేందుకు సిద్ధం చేశాం. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి స్క్రీంనింగ్ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా ఉపయోగపడతాయి. మరో 3, 4 వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి’ అని కోరారు.
ఎన్నికలను వాయిదా నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించే విధంగా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.