ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడి అయ్యాయి. మంత్రలు అందరూ ఓటమి పాలైయారు. 175 సీట్లకు గాను పార్టీ కేవలం 10 స్థానాలను మాత్రమే గెలుచుకోనుంది. ఇంత ఘోరమైన ఓటమి నేపథ్యంలో వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవిచూసిన తర్వాత వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. వీడియో ఇదిగో, చంద్రబాబు ఇంట్లో సంబరాల వేడుకలు, విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు
అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నాం. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాం. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నాం. అరకోటి రైతన్న ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు. డ్వాక్రా మహిళలు, ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నాం. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం.
మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలుచేశాం. పేద పిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశాం. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేశాం. అయినా, ప్రజల తీర్పును తాము తీసుకుంటాం. మంచి చేయడానికి ఎప్పుడూ ముందుంటాం. పేదవాడికి అండగా ఉంటూ గళం విప్పుతాం. కూటమిలోని భాజపా, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు. ఎన్ని చేసినా మా ఓటు బ్యాంకును 40 శాతానికి తగ్గించలేకపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకుసాగుతాం’’ అని జగన్ వ్యాఖ్యానించారు.