PRC Issue in AP: ఏపీలో ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల సమ్మె, పీఆర్సీ జీవోల అమలుకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర, ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
AP PRC (Photo-Video grab)

Amaravati, Jan 21: పీఆర్సీపై భగ్గుమంటున్న ఉద్యోగులను శాంతపరిచేందుకు ఓ వైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు కీలక ప్రకటన చేశాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తున్నట్టు (AP Employees unions announced strike) ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఏపీ సర్కారు ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యం కాదని వివిధ ఉద్యోగ సంఘాలు కరాఖండీగా చెబుతున్నాయి. దాంతో, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం సీఎం జగన్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పోరాట కార్యచరణలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు (AP Employees unions) సోమవారం నాడు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. ఇవాళ సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరనున్నాయి.

ఒక జిల్లా-ఒక ఎయిర్‌పోర్టు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు, బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచన

అలాగే ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం అసోసియేషన్‌ హాలులో మరోసారి ఆయా సంఘాలన్నీ భేటీ కానున్నాయి. అనంతరం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఐకాస నేతలు సంతకాలు చేయనున్నారు.

మరోవైపు ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని తెలిపింది. బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. తాము మాత్రం పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి తేవొద్దని పేర్కొంది.

ఇక ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Ministers Meeting) ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్‌ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ (AP Cabinet) అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను (PRC GO) యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ వేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ సమీర్ శర్మలను కమిటీలో సభ్యులుగా చేర్చారు..ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులు వివరించి, అపోహలు తొలగించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. 'ఈబీసీ నేస్తం' చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.