Mystery Disease in Eluru: ఏలూరు మిస్టరీ వ్యాధి బాధితుల కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం, మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీలను పెంచుతూ నిర్ణయం, చికిత్స సమయాన్ని మూడు రోజుల నుండి ఐదు రోజులకు పెంపు
Health Minister Alla Nani (Photo-Twtter)

Eluru, Dec 9: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో (Mystery Disease in Eluru) అనారోగ్యానికి గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయంతో పాటు మూడు రకాల చికిత్సలకు (three types of treatments) ప్యాకేజీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Health Minister Alla Nani) వెల్లడించారు. ఈ జీవో ప్రకారం మూర్ఛ వ్యాధిగ్రస్తులకు చికిత్స సమయాన్ని మూడు రోజుల నుండి ఐదు రోజులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుందన్నారు.

ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న ప్యాకేజీని రూ. 15,688కు పెంచడంతో పాటు అందరికీ 8 రకాల రక్త పరీక్షలను చేస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మూర్ఛ వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నవారి సమయాన్ని సైతం మూడు రోజుల నుండి ఐదు రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ. 10,262 నుంచి రూ.12,732కు పెంచారు. ఇందులో 6 రకాల రక్త పరీక్షలను కూడా చేర్చారు. ఇక అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రులలో ఐదురోజుల కాకుండా అదనంగా ఎక్కువ రోజులు చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు రూ.900, ఐసీయూలో చికిత్స పొందితే రూ. 2వేల ప్యాకేజీని కొత్తగా చేర్చామన్నారు.

ఏలూరు మిస్టరీ వ్యాధి, నీటిలోనే సమస్య ఉందా? డిసెంబర్ 11న రానున్న ఎన్ఐఎన్ సైంటిస్టుల నివేదిక, ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

బాధితుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ద్వారా కొన్ని విషయాలు తెలిశాయి. బాధితుల రక్తంలో సీసం( లెడ్), నికెల్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ వింతవ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా తలనొప్పి, మూర్ఛ, వెన్నునొప్పి, నీరసం, మతి మరుపు, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ ఎయిమ్స్‌ నివేదికిచ్చింది. లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని నివేదికలో చెప్పింది.

సీసం అనేది సాధారణంగా బ్యాటరీల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలో వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సీసమ్, నికెల్ వంటి లోహాలు శరీరంలో ఎలా వెళ్లాయనే అంశం పై లోతుగా పరిశోధన సాగుతోంది.మనుషుల రక్తంలో 10 మైక్రోగ్రామ్స్ కు మించి లెడ్ ఉండకూడదని డాక్టర్లు చెబుతుండగా ఏలూరు బాధితుల్లో లెడ్ శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరంతా పైకి ఆరోగ్యంగా ఉన్నా రక్తంలో లెడ్ శాతం పెరగడం వల్ల సమస్యల బారిన పడుతున్నారు.

లెడ్ శాతం పెరిగితే నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మెదడుపై ఇది ప్రభావం చూపుతోంది. వినికిడి కోల్పోవాల్సి వస్తుంది. కాళ్లు,చేతులు నిస్సత్తువుగా మారుతాయి. లెడ్ శాతం పెరగటానికి కొన్ని కారణాలున్నాయి. తాగునీరు, బోరు వాటర్, రోడ్డుపక్కన అమ్ముతున్న తినుపదార్థాలలో ఉపయోగించే రంగులు ఇందుకు కారణం కావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య 571కి చేరింది. మొత్తం 468 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స పొందుతున్నారు.