AP SEC Row: ఏపీ సీఎం చెంతకే మళ్లీ నిమ్మగడ్డ ఫైలు, ఎస్‌ఈసీ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన గవర్నర్, సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున నిర్ణయం తీసుకోలేమంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati, July 23: ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ (AP Governor Biswabhusan Harichandan) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడం లేదంటూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు (AP High Court) స్పందిస్తూ ఈ అంశంపై గవర్నర్‌ను కలవాలని సూచించింది.  రాజ్‌భవన్‌కు చేరిన మూడు రాజధానుల బిల్లు, ఆమోదించవద్దని గవర్నర్‌కు చంద్రబాబు లేఖ, నిబంధనల ప్రకారమే గవర్నర్ చెంతకు చేరాయన్న వ్యవసాయమంత్రి కన్నబాబు

ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఇటీవల గవర్నర్‌ను కలసి తాను ఎన్నికల కమిషనర్‌గా (State Election Commissioner) బాధ్యతలు స్వీకరించేందుకు అనుమతించాలని కోరారు. దీన్ని పరిశీలించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హైకోర్టు తీర్పు మేరకు తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అదే విషయాన్ని గవర్నర్‌ కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా లేఖ ద్వారా నిమ్మగడ్డకు బుధవారం తెలిపారు. మీటింగ్ మతలబు అదేనా?, బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోటల్లో రహస్య భేటీ, సుప్రీంకోర్టులో విచారణలో నిమ్మగడ్డ తొలగింపు అంశం

కాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ సూచించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని, ఆర్టికల్‌ 243కె (2)కి సార్థకత ఏర్పడిందన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు.

కరోనా సమయంలో ఎన్నికలు మంచివి కావనే సదుద్దేశంతో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీని తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని చంద్రబాబు విమర్శించారు. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం స్వాగతించే పరిణామమని అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు స్వస్తి చెప్పాలని, ఎస్‌ఈసీ తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

గవర్నర్‌ ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల ప్రధానాధికారి కుర్చీలో కూర్చునేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగ్గా లేదని విమర్శించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి... ఆయన రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని విమర్శించారు.

ఎన్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా...రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని గౌరవించాల్సిన పని లేదా ? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ ప్రవర్తించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఎందుకు రహస్యంగా కలుస్తున్నారని ప్రశ్నించారు. రూ. కోట్లు ఖర్చు చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. తనకు సంబంధించి వ్యక్తులే కీలకమైన పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

సుప్రీంకోర్టులో ఓవైపు దీనికి సంబంధించి రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హడావిడిగా నిర్ణయం తీసుకోలేమని గవర్నర్ కు చెప్పడం, హైకోర్టే గతంలో ప్రభుత్వానికి ఎస్ఈసీని నియమించే అధికారం లేదని చెప్పడం, గవర్నర్ ఇంకా జస్టిస్ కనగరాజ్ నియామక ఆర్డినెన్స్ ఉపసంహరించుకోకపోవడం వంటి అంశాలు జగన్ సర్కారుకు కలిసి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అయితే ప్రభుత్వం దీన్ని సాగదీసే కొద్దీ నిమ్మగడ్డ మరోసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.