Vijayawada, April 13: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి (YS jagan)సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావించి.. పరిశీలించి, ఆ తరువాత విరమించుకున్న నగదు బదిలీ విధానాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఆ మాటకొస్తే రెండేళ్ల క్రితమే జగన్ సర్కార్ ఈ ఆలోచన చేసింది. కానీ అప్పుడు ఆచరణ కాలేదు. గత ఏడాది కూడా రేషన్ బదులు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నించింది. ఎవరైనా లబ్ధిదారు బియ్యం వద్దనుకుంటే బదులుగా నగదు ఇవ్వాలని భావించింది. దీనిపై కసరత్తు కూడా చేసింది.
ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం (Sub-Committee) చేసిన సిఫార్స్‌పై ప్రభుత్వం కసరత్తులు కూడా చేసింది. కానీ చాలారోజులు అనుకుంటున్న ఈ పథకం చాలా రోజులుగా ఆచరణకు నోచుకోలేదు. పైగా పెండింగ్ పడుతూ వచ్చింది. కాగా ఇప్పుడు త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మే నుంచి ఈ నగదు బదిలీ (Cash Transfer) పథకాన్ని అమలు చేయనుండగా ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో అమలు చేయనున్నారు. ఈనెల 18 నుండి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకోనుండగా.. బియ్యం వద్దనుకునే లబ్ధిదారులకు కిలోకు రూ.12 నుండి రూ.15 చెల్లించనున్నట్లు తెలుస్తుంది.