AP Cabinet Meet | ( Photo-Twitter)

Amaravathi, August 6: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు నాడు-నేడు కింద పాఠశాలల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వం మెరుగైన విద్యను అందించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నాని శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దీనిలో భాగంగా, ఏ తరగతిలోనైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ అని అలాగే ప్రారంభ దశ నుంచే విద్యార్థులకు నాణ్యమైన  విద్యను అందించడానికి విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి గానూ 6,22,856 మంది కొత్త విద్యార్థులు నమోదు చేయబడ్డారని మరియు నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించబడినట్లు తెలిపారు

1) శాటిలైట్ స్కూల్స్ (PP-1, PP-2),

2) ఫౌండేషన్ స్కూల్స్ (PP-1, PP-2. 1, 2)

3) ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (PP-1  5వ తరగతి)

4) ప్రీ హై స్కూల్స్ (3వ తరగతి నుండి 7వ లేదా 8వ  వరకు)

5) ఉన్నత పాఠశాలలు (3 నుండి 10వ తరగతి వరకు)

6) హైస్కూల్ ప్లస్ (3 నుండి 12వ తరగతి)

ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక తరగతిగది ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4,878 అదనపు తరగతి గదులు మంజూరు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకబడకూడదనేదే సీఎం జగన్‌ లక్ష్యమని మంత్రి పేర్ని నాని వివరించారు. మంచి విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారన్నారు.

ఈనెల 16న విద్యాకానుక అందిస్తాం. స్కూల్‌ యూనిఫామ్స్, షూస్, టై, బ్యాగ్‌ అన్నీ అందించడం జరుగుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ అంతిమ లక్ష్యం ఎన్ని బాధలు ఉన్నా.. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేద, మధ్య తరగతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ చదువులో వెనకబాటుపడకూడదు. పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారానే పోతుందని నమ్ముతున్న సీఎం జగన్, లక్షల మంది పిల్లలను ప్రయోజకులుగా సమాజానికి అందిద్దామని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

ఏపి కేబినేట్ తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలు:

 

  • చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి నేతన్న నేస్తం పథకం ఆగస్టు 10వ తేదీన అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.24 వేల ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో సుమారు 4 లక్షల మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందేలా రూ.200 కోట్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
  • అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.10 వేల లోపు డిపాజిట్‌ దారులైన 3.40 లక్షల మందికి ఇప్పటికే రూ.238.70 కోట్ల పైచిలుకు పంపిణీ చేసినట్లు వెల్లడి. మరో 4 లక్షల మంది డిపాజిట్‌ దారుల కోసం అదనంగా రూ.500 కోట్లు చెల్లించేందుకు మంత్రిమండలి తీర్మానం ఈనెల 24వ తేదీన అగ్రిగోల్డ్‌ బాధితుల్లోని రూ.10 వేల నుంచి 20 వేల మధ్య డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించాలని తీర్మానం.
  • రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మరియు కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ, మున్సిపల్‌ పరిధుల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను క్రమబద్దీకరించడానికి నిర్ణయం. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి అమల్లోకి వస్తుంది.
  • 1977 నాటి ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం పీఓటీ యాక్ట్‌లో చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అసైన్డ్‌ భూమి లేదా అసైన్డ్‌ ఇంటి విక్రయానికి ఇప్పుడున్న గడువు 20 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం.
  • బందర్‌ పోర్టు నిర్మాణం కోసం రివైజ్డ్‌ డీపీఆర్‌ కి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు టెండర్‌ 2021 ఆగస్టు 24 చివరి తేదీగా ఉంది. 24వ తేదీన వచ్చిన టెండర్లలో ప్రభుత్వ రూల్స్‌ ప్రకారం ఫైనల్‌ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు రివైజ్డ్‌ డీపీఆర్‌కు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
  • నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పబ్లిక్‌ ప్రైవేట్‌ పాట్నర్‌షిప్‌ పద్ధతిలో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన టెక్నో ఎకనమిక్‌ ఫీజుబుల్టీ స్టడీ రిపోర్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.550 కోట్ల ఖర్చుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • చిత్తూరు జిల్లా పుంగనూరులో రవాణా శాఖలో ఒక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్, సీనియర్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు హోంగార్డు పోస్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయం మరియు రాష్ట్ర మానవ హక్కుల సంఘ కార్యాలయాలను కర్నూలు పట్టణానికి తరలించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
  • రాష్ట్రంలో పశుసంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ భవైనీ బ్రీడింగ్‌ ఆర్డినెన్స్‌ 2021కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి ఉద్దేశించిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం. రాష్ట్ర ఉత్పత్తిలో 30శాతం వరకూ స్థానికంగానే వినియోగం కోసం చర్యలు. పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్‌ టెక్నిషియన్, 8 ల్యాబ్‌ అటెండెట్లు పోస్టుల మంజూరుకు ఆమోదం. కాంట్రాక్టు పద్ధతిలో టెక్నిషియన్లు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండెంట్ల నియామకం.
  • రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం. ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్‌ఆమోదం.