Amaravati, Jan 23: ఏపీ ప్రభుత్వం రోడ్లపై సమావేశాలు, సభలు నిర్వహించకూడదంటూ తీసుకొచ్చిన జీవో నెం 1పై (AP Govt Go No1 Petition) రాష్ట్ర హైకోర్టు చేపట్టిన విచారణ రేపటికి వాయిదా పడింది. నేటి విచారణ సందర్భంగా జీవో నెం.1ను తాత్కాలికంగా నిలిపివేతను కొనసాగించేందుకు హైకోర్టు (AP High Court) నిరాకరించింది. దీంతో జీవో నెం1పై ఉన్న స్టే ముగిసింది. అదే సమయంలో జీవో నెం.1 అమల్లోకి వచ్చినట్లయ్యింది.
నేడు విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెకేషన్ బెంచ్ డీఫాక్టో చీఫ్ జస్టిస్‌లా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించదన్నారు. ప్రతి కేసు ముఖ్యమైనదేనని భావించుకుంటూ వెళ్తే హైకోర్టు ఏమైపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరిగితే ప్రతి వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.
పిటిషన్ మూలాల్లోకి వెళ్లి చూస్తే అంత ఎమర్జెన్సీ కూడా అనిపించలేదని, ఈ కేసు గురించి, దాని మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నానని హైకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. తనకేమీ తెలియదని అనుకోవద్దని, రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు తనకు నివేదించిందని తెలిపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా తన అధికారాలను పూర్తిగా వినియోగిస్తానని స్పష్టం చేశారు. తన పిటిషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్టు ముందు ధర్నా జరిగిందా? అంత అర్జెంటుగా వెకేషన్ బెంచ్‌లో లంచ్ మోషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఎలాంటి అత్యవసరం లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కాగా జీవో నెం 1పై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశంపై హైకోర్టు విచారణ చేపట్టింది.