File image of High Court of Andhra Pradesh | File Photo

Amaravati, April 6: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పరిషత్ ఎన్నికలను (AP ZPTC & MPTC Polls) నిలిపేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు (AP High Court) పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ (SEC) జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.

ఏపీ ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ వేసిన పిటిషన్లపై ఏపీ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పోలింగ్ కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఇది గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ అని, కొవిడ్ వల్ల ఆగిపోయిందని, దాన్నే కొనసాగిస్తున్నామని ఎస్ఈసీ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నందున వాటిని అతిక్రమించరాదని జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం ఎస్ఈసీకి, ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఎల్లుండి జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 8న పోలింగ్‌, 10న ఫలితాలు, ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ (AP ZPTC MPTC elections 2021) విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ , 10న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది.

గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుందని ఉత్తర్వుల్లో తెలిపింది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఇప్పటికే  126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.