Amaravati, May 2: ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వాయిదా (AP Inter Exams 2021 Postponed) వేసింది. వాస్తవానికి, ఏపీ ప్రభుత్వం ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారం హైకోర్టు (AP High Court) వరకు వెళ్లింది. అయితే, చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇప్పటికే విద్యార్థుల ప్రాక్టికల్స్ పూర్తి అయ్యాయి. విద్యార్థుల ప్రాణాలు, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలపనుంది.
ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 5 నుండి 23 వరకు జరగాల్సి ఉంది. మే 5 నుంచి 22 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మే 6 నుంచి 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షల నిర్వహణ వద్దని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. మరికొందరు ఈ అంశంపై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో కొంతకాలం పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.