Amaravati, Jan 25: ఏపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పంచాయితీ ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections 2021) నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూలును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు (A.P. High Court) ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. అది నేడు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది.
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారించనుంది. సప్లిమెంటరీ జాబితాలో తొలుత 39వ ఐటెమ్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించాల్సి ఉండింది. అయితే ఆ ధర్మాసనం (Supreme Court) నుంచి ఈ పిటిషన్‌ను తొలగిస్తున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా పేర్కొంది. అనంతరం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ద్విసభ్య ధర్మాసనం జాబితాలో చేర్చింది.
ఇదిలా ఉంటే ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కాగా, ఇంతవరకూ నోటిఫికేషన్ వెలువడిన ఏ ప్రాంతంలో కూడా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జరగలేదని తెలుస్తోంది. నేడు నామినేషన్లు వేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్పష్టం చేయగా, వాటిని స్వీకరించేందుకు కూడా అధికారులు అందుబాటులో లేరని సమాచారం. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ (Nimmagadda Ramesh kumar), ఈ ఉదయం 9 గంటలలోపే ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎన్నికలను సజావుగా జరిపించేందుకు సంబంధిత అన్ని వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం సహకరించేందుకు సుముఖంగా లేవని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వంతో పాటు, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరుగనుంది. ఇదే సమయంలో గత సంవత్సర కాలంలో మైనారిటీ తీరిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించిన తరువాత మాత్రమే ఓటింగ్ నిర్వహించాలని మరో పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి భారతదేశంలోనే మొదటిసారి చూస్తున్నా అంటూ ఆయన వ్యవహారశైలిని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి.. అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని సూచించారు.
అదే విధంగా అదృశ్య శక్తి ఎవరో వెనక ఉండి నిమ్మగడ్డను నడిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ చేస్తున్నదాడిని మీడియా ద్వారా చూస్తున్నానని.. రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయాలే తప్ప రాజకీయ నాయకులలాగా పట్టుదలకు పోవడం మంచిగా లేదన్నారు. రచ్చ చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు.
మరోవైపు, గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నగరపాలక సంస్థలకు వచ్చే నెల 21న, 81 పురపాలక సంఘాలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు 28న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. నగర పాలక సంస్థల ఓట్ల లెక్కింపు వచ్చే నెల 23న, మిగిలిన వాటికి మార్చి 2న లెక్కింపు జరగనుంది. కాగా, ఓట్ల లెక్కింపును ఒకే రోజు కాకుండా రెండు వేర్వేరు రోజుల్లో చేపట్టనుండడంపై కోర్టులో సవాలు చేయనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.