COVID 19 Testing (Photo Credits: Pixabay)

Amaravathi, May 6: విపత్తు పరిస్థితుల్లో ప్రజలను మరింత భయపెట్టడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో N440K వైరస్ వేరియంట్ అనేదే లేదని ఆయన స్పష్టం చేశారు. "మేము ప్రతి నెలా 250 శాంపుల్స్ ను సిపిఎంబికి పంపుతాము. ఏపి, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలు వైరస్ యొక్క జన్యు శ్రేణి పరీక్షల కోసం సిసిఎంబికి శాంపుల్స్ పంపుతున్నాయి. గతేడాది 2020 జూన్ మరియు జూలై నెలల్లో దక్షిణ భారతదేశం నుండి వచ్చిన నమూనాలలో ఎన్ 440కె (బి 1.36) వైరస్ కనుగొనబడింది. ఈ ప్రభావం గత డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరిలలో కనిపించింది. కానీ మార్చి నాటికి ఈ వేరియంట్ పూర్తిగా కనుమరుగైంది, ఇప్పుడు దీని ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంది" అని జవహర్ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో బి 1167 మరియు బి 1 వైరస్ అనే వేరియంట్ల ప్రభావం తీవ్రంగా ఉంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన పాజిటివ్ కేసుల డేటాను పరిశీలించినప్పుడు ఇది నిర్ధారించబడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ యువతలో వేగంగా వ్యాప్తి చెందుతోందని జవహర్ రెడ్డి అన్నారు. ఇక ఏపిలో 15 రేట్లు ప్రమాదకరమైన N440K వేరియంట్ ఉందని అవాస్తవాలను వ్యాప్తి చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,147 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 21,954 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,28,156 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 12,25,291గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 3,531 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు నుంచి 2,354, విశాఖపట్నం నుంచి 2,107 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 72 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 8,446కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,141 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 10,37,411 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,82,329 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.