AP Movie Ticket Price Issue: సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని తెలిపిన మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ
AP Minister Perni Nani Press Meet After Tollywood celebrities meet CM Jagan (Photo-Twitter)

Amaravati, Feb 10: ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (Tollywood celebrities meet CM Jagan) సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ఒక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు.

మెగాస్టార్‌ చిరంజీవి అందర్నీ సమన్వయం చేశారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని గుర్తుచేశారు. సినీ పరిశ్రమ ప్రముఖులు అందరూ కూడా ప్రతి సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించారని పేర్కొన్నారు. హీరో చిరంజీవి.. సినీ పరిశ్రమ సమస్యలన్నీ సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సుమారు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్‌ నారాయణ మూర్తి, నిరంజన్‌ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి బృందం వీడియో

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ( Tollywood celebrities meet CM Jagan) ముగిసింది. టికెట్‌ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్‌ నారాయణ మూర్తి, నిరంజన్‌ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. టికెట్‌ ధరలు, ఏసీ, నాన్‌ఏసీ థియేటర్లలో టికెట్‌ ధరల పెంపు సహా ఇండస్ట్రీకి చెందిన 17 అంశాలపై సినీ పెద్దలు సీఎంతో చర్చించారు.

తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాల మనుగడ చాలా కష్టంగా ఉందని నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ భారీ సినిమాలు విడుదలైనప్పుడు అన్ని థియేటర్లు ఆ సినిమాలనే ఆడిస్తాయన్నారు. చిన్న సినిమాలను ఆడించే పరిస్థితి లేదని, అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సగటు సినిమాల మనుగడ కాపాడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అలాగే తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇచ్చేలా చూడాలని నారాయణమూర్తి నిర్ణయించారు.

ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు, మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు

సినిమా టికెట్ల వ్యవహారంలో అందరి తరపున ప్రభుత్వంతో చర్చలు జరిగేలా దారి చూపించినందుకు మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ మహేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్ల అంశంలో గత కొద్ది నెలలుగా గందరగోళంలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద ఉపశమనం లభించిందని అన్నారు. రానున్న పదిరోజుల్లో ఓ శుభవార్త మన ముందుకు రాబోతోందన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై స్పందించి చర్చలకు ఆహ్వానించిన మంత్రి పేర్నినానికి, సీఎం జగన్‌కు మహేష్‌ బాబు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సీఎం జగన్‌తో భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడిందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్ ఆమోదం తెలిపారన్నారు. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ తరపున ఏపీ సీఎంకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

తర్వాత మీడియాతో మాట్లాడిన రాజమౌళి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి సినీ పరిశ్రమ మీద ఉన్న అవగాహనకు నిజంగా తాను ఆశ్చర్యపోయానని అన్నారు. సినీ పరిశ్రమ కష్టాలు ఏమిటి? పెద్ద సినిమా నిర్మాతలకు ఇబ్బందులు ఏమిటి? చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బందులు ఏమిటి? ఇలా ప్రతి ఒక్క అంశం మీద వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవగాహన ఉందని నిజంగా తను చాలా ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను అని పేర్కొన్న రాజమౌళి చాలా ఓర్పుతో ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు విన్న జగన్ మోహన్ రెడ్డి తమకు దిశా నిర్దేశం చేశారని అన్నారు.

ఈ భేటీకి చొరవ తీసుకున్న మంత్రి పేర్ని నాని గారికి థాంక్స్ అని పేర్కొన్న ఆయన చిరంజీవి గారికి పెద్ద అనడం ఇష్టం ఉండదు.. కానీ ఇప్పుడు ఆయన చేసిన పనులే నిరూపించాయి ఆయన ఇండస్ట్రీకి పెద్ద అని.. సీఎంతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థాంక్స్ అని అన్నారు.

మహేష్ తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ ఈ విషయంలో సీఎం గారు ఇండస్ట్రీ సమస్యల గురించి చాలా అర్థం చేసుకున్నారని అన్నారు. సమస్యలపై పాజిటివ్‌గా స్పందించినందుకు ఆయనకు థ్యాంక్స్ అని అన్నారు. 6, 7 నెలల నుంచి మేమంతా కన్ఫ్యూజన్‌లో ఉన్నాం అని ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నందుకు చిరంజీవి గారికి, పేర్ని నాని గారికి థాంక్స్ అని ప్రభాస్ పేర్కొన్నారు.

అలాగే ముఖ్యమంత్రి గారు మరొక మాట కూడా అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఎలాగైతే అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహాలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని వివరణ ఇచ్చారు. అందుకు కావలసిన వసతులను కూడా ప్రభుత్వం తరఫున అన్ని మద్దతుగాగా ఉంటాయని ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు.