AP MPTC, ZPTC Elections 2021: టీడీపీ అవుట్, బీజేపీ సై, నిజమైన ప్రతిపక్షం మాదేనంటున్న సోము వీర్రాజు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహష్కరించిన టీడీపీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన బీజేపీ
Polls 2021 | (Photo-PTI)

Amaravati, April 3: రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌సీపీని ఎదుర్కోగల సత్తా బీజేపీకి (BJP) మాత్రమే ఉందనే మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరుతో ఆ పార్టీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.

బీజేపీ ఎన్నికల నుంచి ఎప్పుడూ తప్పుకోదని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలు రాష్ట్రంలో బీజేపీని మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా నమ్ముతున్నారని, ప్రజల కోసం మరింత బాధ్యతగా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను తామే పోషించబోతున్నామని పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు (TDP chief N Chandrababu Naidu) మాట్లాడుతూ.. ఎన్నికలంటే భయం లేదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు బహిష్కరించడం (TDP Boycott Election In AP) తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. పార్టీ 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. పంచాయతీ ఎన్నికల్ని నాలుగు దశల్లో పెట్టారని, ఈ ఎన్నికల్ని ఒకేదశలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ఎస్‌ఈసీ ఉదయం బాధ్యతలు తీసుకుని సాయంత్రం నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏమిటన్నారు. అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్‌ఈసీకి ఉందా అని ప్రశ్నించారు.

ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, ఆవేదన ఉన్నా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి నేతలు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారన్నారు. రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, వాలంటీర్లు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఫార్స్‌గా తయారయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీ అక్రమాలపై జాతీయస్థాయిలో పోరాడతామన్నారు. దౌర్జన్యాలు, అక్రమాలతో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, పోటీచేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని ఆరోపించారు.

అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేమన్నారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికలపై కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వమని అడిగామని, అది ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికమని హైకోర్టులో పిటిషన్‌ వేశామని, శనివారం విచారణ జరుగుతుందని తెలిపారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు.

ఇదిలా ఉంటే బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు టీడీడీ పార్టీ అధినేతపై మండి పడ్డారు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల కొనుగోలు, నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిపై సీఐడీ వేగంగా విచారణను పూర్తిచేసి అసలైన దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోము వీర్రాజు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసినట్టు ఆ పార్టీ శుక్రవారం మరో ప్రకటనలో పేర్కొంది.

ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లిన బీజేపీ 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని నిలిచిపోయిన దశ నుంచి నిర్వహించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచీ నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నోటిఫికేషన్‌లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీజేపీ నేత పాతూరి నాగభూషణం, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు శుక్రవారం హౌస్‌మోషన్‌ రూపంలో విచారించారు.

ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను శనివారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ లోపు కౌంటర్లను పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.