Amaravati, Mar 14: ఏపీలో పురపాలక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. 10 నుంచి 11 గంటల మధ్య తొలి ఫలితం (AP Municipal Election Results 2021) వెలువడనుంది. సాయంత్రం ఆరు గంటల్లోగా అన్ని చోట్లా ఫలితాలు (municipal corporations, municipalities/nagar panchayats) వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖల మాత్రం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడి డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ఇక హైకోర్టు ఆదేశాలతో ఏలూరు నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.
మొత్తం 11 నగర పాలక సంస్థల్లో 533 డివిజన్ సభ్యుల స్థానాలకు పోలైన 27, 29, 072 ఓట్ల లెక్కింపు చేపట్టారు. 71 పురపాలక, నగర పంచాయితీల్లో 1633 వార్డు సభ్యుల స్థానాలకు పోలైన 21,03284 ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా గుంటూరు చిలకలూరి పేట మునిసిపాలిటిపై సందిగ్ధత తొలగిపోయింది. ఇక్కడ విజేతలకు ఇచ్చే పత్రాల్లో హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని తెలిపింది. మొత్తం పుర పాలక, నగర పాలక పంచాయితీల్ోల పోలైన మొత్తం ఓట్లను 4028 టేబుళ్లలో 12, 607 మంది సిబ్బంది లెక్కిస్తున్నారు.
పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటించనున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెండు చోట్ల కౌంటింగ్ నిలిపివేత
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 మంది పోలీసులను నియమించారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు... 1,345 మంది ఎస్సైలు... 17,292 మంది కానిస్టేబుళ్లతో పాటు 1,134 మంది ఇతర సిబ్బంది భద్రతా విధుల్లో పాలుపంచుకోనున్నారు.
కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1822 టేబుళ్లు మొత్తం 4026 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్‌లలో కౌంటింగ్ సూపర్ వైజర్లు- 2376, కౌంటింగ్ సిబ్బంది -7412 మంది, మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్లు-1941, కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5195 మందిని ప్రభుత్వం నియమించింది.
ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు/వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
కాగా గుంటూరు, విజయవాడ మరియు విశాఖపట్నం అనే మూడు ప్రధాన మునిసిపల్ సంస్థలపైనే అందరి దృష్టి ఉంది - ఈ పౌర సంస్థలలో ఫలితం వివాదాస్పద రాష్ట్ర రాజధాని సమస్యపై వర్చువల్ ప్రజాభిప్రాయ సేకరణగా ఉంది.