
VJY, Sep 14: పరిపాలనలో దూసుకుపోతున్న జగన్ సర్కారు మరో ఘనతను సొంతం చేసుకుంది. పెట్టుబడులు రాబట్టడంలో దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలి 7 నెలల్లో ( period of seven months) పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించింది.
తొలి ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులను (AP received investments of Rs. 40,361 crores) ఏపీ రాబట్టినట్లు డీపీఐఐటీ తన నివేదికలో వెల్లడించింది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ, ఒడిశా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాలు 45% పెట్టుబడులు రాబట్టినట్లు డీపీఐఐటీ జూలై నివేదికలో పేర్కొంది. అయితే తొలి ఏడు నెలల్లో దేశమంతా రూ.లక్షా 71వేల 295 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇందులో ఏపీకి రూ.40,361 కోట్లు, ఒడిశాకు రూ.36,828 కోట్ల పెట్టుబడులు వచ్చాయని డీపీఐఐటీ తెలిపింది.
సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ కేబినెట్ ఇప్పటికే ఇతర రంగాల్లో ఎస్ఐపీబీ (SIPB) ద్వారా రాష్ట్రానికి వచ్చిన 1,26,748 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రస్తుతం ఆమోదించిన ఈ పెట్టుబడులతో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ భారీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. త్వరలోనే విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు ప్రారంభం కానుంది. అటు తిరుపతి, శ్రీకాళహస్తి శివారు ప్రాంతాల్లో సుమారు రూ.6వేల కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. మొత్తానికి భారతదేశంలోనే పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఏపీ నిలుస్తోందని డీపీఐఐటీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.