AP Health Minister Alla Nani (Photo-Video Grab)

Amaravati, Oct 20: ఏపీలో తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 2,918 కొత్త కేసులు (AP Coronavirus Report) వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 468 పాజిటిట్ కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది.అదే సమయంలో ఏపీలో 24 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,453కి పెరిగింది. తాజాగా 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. 7,44,532 మందికి కరోనా నయం కాగా, ఇంకా 35,065 మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ (Coronavirus) రెండో దశ వ్యాప్తికి అవకాశం ఉందని.. అయితే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం (AP govt) సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని (Health Minister Alla Nani) అన్నారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, 13 జిల్లాల జాయింట్‌ కలెక్టర్లతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే కరోనా కాలం ఆరోగ్యశాఖకు చాలా కీలకమన్నారు. కాగా, నవంబరు రెండో వారం నుంచి సదరమ్‌ క్యాంప్‌లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాని తెలిపారు. ఆరోగ్యశ్రీని మరింత పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే ఏ లబ్ధిదారుడైనా ఆస్పత్రిలో చేరినప్పటినుంచి డిశ్చార్జి అయ్యేవరకు అతనికి సేవలందించే విషయంలో పూర్తిబాధ్యత మనదే. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిందంటే ఆ ఫిర్యాదు అక్కడికక్కడే పరిష్కారం కావాలి’ అని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) చెప్పారు.

ప్రజలకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందుతున్నాయా, లేదా అని ప్రతిరోజూ నిఘా ఉండాలి. ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఏ ఆస్పత్రుల్లోనైనా నాణ్యత లేకపోతే వాటిని జాబితానుంచి తొలగించాలి. ఏ గ్రామ సచివాలయం వద్దకు వెళ్లినా బాధితులకు ఆరోగ్యశ్రీ సేవల సమాచారం అందించాలి. జాబితాలోని ఆస్పత్రులపై ప్రత్యేక నివేదిక ఉండాలి. ఆరోగ్యమిత్రలను తక్షణమే నియమించాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ ఉండాలి. ఐవీఆర్‌ఎస్‌ను మరింత అభివృద్ధి చేయాలి.

ఇప్పటివరకు ఆరోగ్య ఆసరాకు రూ.145 కోట్లు వ్యయం అయింది. 2.50 లక్షల మంది లబ్ధిపొందారు. వైకల్యం సర్టిఫికెట్ల కోసం వచ్చేవారికి అదేరోజు ఇవ్వాలి. వారిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుకోకూడదు. కరోనా రెండోదశను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు, మలేరియా, డెంగీ వంటి దోమకాటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు,