
Amaravathi, May 5: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న 20 వేల కేసులు నమోదు కాగా, నేడు ఆ సంఖ్య 22 వేలు దాటింది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో బుధవారం నుంచి పాక్షిక లాక్డౌన్ అమలు అవుతోంది. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత అత్యవసర సేవలు మినహా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయేలా ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తోంది. అయితే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటి సర్వీసెస్, బ్యాంకులు, ఎల్‌పిజి, సిఎన్‌జి, గ్యాస్ అవుట్‌లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా, నీటి సరఫరా, పారిశుధ్యం, గిడ్డంగులు, భద్రతా సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయించారు.
ఉత్తర్వుల ప్రకారం మే 18 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూలో భాగంగా మధ్యాహ్నం ప్రతిరోజు 12 నుంచి ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దైవ దర్శనానికి తిరుమల వచ్చే భక్తులు మాత్రం తమ దర్శనానికి సంబంధించిన టికెట్ చూపిస్తే అనుమతి ఇస్తారని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,16,367 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 22,204 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,06,232 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 12,033,37గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 2,344 కోవిడ్ కేసులు నమోదు కాగా.. అనంతపూర్ నుంచి 2,304, విశాఖపట్నం నుంచి 2,113 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 85 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 8,374కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 11,128 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 10,27,270మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,70,588 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.