Amaravati, July 28: కృష్ణా జిల్లా జీ.కొండూరు వివాదంలో అరెస్ట్ (Devineni Uma Arrest) అయిన టీడీపీ మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావును బుధవారం నందివాడ పోలీసు స్టేషన్‌కు (Nandivada police station) తరలించారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగా.. నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. మీడియాతో సహా సాధారణ ప్రజలను సైతం గ్రామంలోకి వెళ్లనివ్వలేదు. పోలీసులు పలుచోట్ల భారీకేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు దేవినేని ఉమాకు (AP TDP leader Devineni Uma maheswara rao) కోవిడ్ పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జి.కొండూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతల దాడి చేశారనే ఆరోపణలతో దేవినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలిసిందే. జీ.కొండూరు వివాదానికి మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌లు తెలిపాన విషయం తెలిసిందే. మాజీ మంత్రి దేవినేని ఉమపై హత్యయత్నం కేసు నమోదు చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమపై దాడికి పాల్పడిన నేతలను వదిలిపెట్టారని మండిపడ్డారు. తెదేపా నేతలపై హత్యాయత్నం కేసు పెడతారా?అని ప్రశ్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ అరెస్టు, తదితర విషయాలపై ఇందులో ఆయన ఆ పార్టీ నేతలతో చర్చించనున్నారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. మచిలీపట్నంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
దేవినేని ఉమా అరెస్టుకు నిరసనగా జిల్లాలో ఆందోళనలకు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అల్లర్లు జరగకుండా నేతలను ముందుస్తుగా గృహ నిర్భంధం చేశారు. దేవినేని ఉమ అరెస్టును ఖండిస్తూ కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఉమను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
కాగా కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఉమా కారు అద్దాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం దేవినేని ఉమా అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం నాయకులంతా కొండపల్లి రిజర్వు అడవిలోకి వెళ్లారు. అక్కడ గతంలో అక్రమంగా తవ్వకాలు జరిగాయని వారు ఆరోపించిన ప్రాంతాన్ని పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమాలపై ఇంతవరకూ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఈ దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణల నేపథ్యంలో దేవినేని ఉమను పోలీసులు డొంకరోడ్డులో జి.కొండూరు తీసుకెళ్లారు. ఇక్కడే టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసు రక్షణ మధ్య టీడీపీ నేతల వాహనాలు జి.కొండూరు స్టేషను సమీపానికి చేరుకున్నాయి. వైసీపీ నేతలు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకుని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఎక్కువై అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘర్షణల్లో వైసీపీ నేత కారు అద్దాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసులు వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు.
కాగా దేవినేనిపై 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.