Vjy, May 25: ఏపీలో వాతావరణంపై ఏపీ వెదర్ డిపార్ట్ మెంట్ అప్ డేట్ ఇచ్చింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాలో వర్షాలు పడతాయని, మరి కొన్ని జిల్లాల్లో ఎండలు ఎక్కువగా కాస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
పలు చోట్ల ఓ మోస్తరు నుంచి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఈ రోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద ఉండరాదని తెలిపింది.
పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట,పెదకూరపాడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తులు నిర్వహణ సంస్థ సూచించింది. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. నిన్న శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44.8°C, పల్నాడు జిల్లా మాచర్లలో 44.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని డా. బీఆర్ అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.