APSPDCL CMD H Harinath Rao (Photo-Video Grab)

Amaravati, Nov 11: తుఫాను ఏపీని వణికిస్తోంది. భారీ వర్షాలు పలు జిల్లాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం అలర్ట్ అయింది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాథ రావు (APSPDCL MD Haranatha Rao) ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం ఉదయం సీఎండి హరనాథ రావు 5 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌లతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

టెలికాన్ఫరెన్స్ సందర్భంగా APSPDCL సీఎండీ హరనాథ రావు మాట్లాడుతూ..తుఫాను కారణంగా ఎదురయ్యే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 94408 17412, కడప: 94408 17440, కర్నూలు: 73826 14308, అనంతపురం: 94910 67446, నెల్లూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 9440817468లకు కాల్ చేసి విద్యుత్ ప్రమాదాలు, సమస్యలపై సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు.

తుఫాను ముప్పు, నీట మునిగిన నెల్లూరు, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అదేశాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

తుఫాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. వినియోగదారుల సమస్యలపై తక్షణం స్పందించేందుకు వీలుగా ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు ఒదిగిపోవడం తదితర ప్రమాదాలు సంభవించినట్లు అయితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా డ్రిల్లింగ్ యంత్రాలు, సామాగ్రిని, వాకిటాకీలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

బలమైన గాలి, వర్షం ఉన్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపోవడం జరిగినట్లయితే తక్షణమే కంట్రోల్ రూమ్ లకు గానీ, సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు గానీ లేదా టోల్ ఫ్రీ నెంబరు; 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్‌ చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించినట్లు సీఎండీ తెలిపారు.వర్షాల కారణంగా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించినట్లు తెలియజేశారు.