Vijayawada, SEP 01: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ (APSRTC) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (UTS) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీ సేవలన్నింటినీ ఒకే యాప్ కిందకు తెచ్చేందుకు అధికారులను నిర్ణయించారు. ఈ యాప్‌తో అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే బస్ టికెట్ బుకింగ్‌తోపాటు బస్సుల రాకపోకలు, గూడ్స్ రవాణా వంటి విషయాలను తెలుసుకునే వీలుంటుందని అధికారులు అంటున్నారు.
ఇప్పటి వరకు బస్సుల్లో నగదు ద్వారానే టికెట్లు ఇస్తుండగా.. ఇకపై డెబిట్ కార్డు (Debit card), క్రెడిట్ కార్టు (Credit card), వాలెట్లు (Wallet), యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులు జరుపవచ్చని అధికారులు పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో (QR Code Scaning) కూడా టికెట్లు పొందే వీలుందని.. రానున్న రోజుల్లో పేపర్ టికెట్ నామమాత్రం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
బస్సులో ప్రయాణిస్తూనే మరో స్టేజి నుంచి వేరే బస్సులో వెళ్లేందుకు కూడా టికెట్ తీసుకునే వీలు కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.