రానున్న పండగల పూట ప్రయాణాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను నడిపించనున్నట్లు స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున కర్ణాటక ప్రజలు జరుపుకునే పండుగ దసరా. ప్రత్యేకించి విజయవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పండుగ నేపథ్యం.. సెలవుల్లో ప్రయాణాల దృష్ట్యా ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసుల్ని నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణ.. ప్రత్యేకించి హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, చెన్నై లాంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా APSRTC ఏర్పాట్లు చేస్తోంది. అలాగే విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సుల్ని నడిపించనున్నట్లు తెలిపింది.
ఎప్పుడు.. ఎక్కడి నుంచి నడుపుతారంటే..
13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి.విశాఖపట్నం నుండి 480బస్సులు,రాజమండ్రి నుండి 355బస్సులు, విజయవాడ నుండి 885బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోనిఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా ఆన్‌లైన్ పేమెంట్స్‌తో ప్రయాణికులు ఏ బాధా లేకుండా ప్రయాణించొచ్చని.. తద్వారా ఆర్టీసీకి చిల్లర సమస్యలు ఉండబోవని ఏపీఎస్సార్‌టీసీ చెబుతోంది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలు కల్పిస్తోంది. రిజర్వేషన్లకు కూడా అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు.. అడ్వాన్స్ రిజర్వేషన్‌తో ఛార్జిలో 10% రాయితీ సౌకర్యము ఉంటుందని తెలిపింది.
బస్సుల ట్రాకింగ్ మరియు 24/7 సమాచారం.. సమస్యలకై కాల్ సెంటర్ నెంబర్ 149 & 08662570005 అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ ధ్యేయమంటూ.. ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.