Badvel, Mar 28: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య (Badvel MLA Venkata Subbaiah Dies) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో సుబ్బయ్యను కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఎమ్మెల్యే కన్నుమూశారు. ఆయన మృతి (MLA Doctor Venkata Subbaiah Passed Away) చెందారని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు, ద్వితియశ్రేణి నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన సుబ్బయ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బద్వేలు వైకాపా ఎమ్మెల్యే మరణం పట్ల పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వెంకట సుబ్బయ్య మృతికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతిపట్ల పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం తెలిపారు.