
Amaravati, Mar 28: ఏపీలో రెండు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accidents) మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మండలం ( Nellore Buchi Reddy Palem) దామరమడుగు జాతీయరహరదారిపై ఆదివారం ఉదయం ఆగిఉన్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టెంపోలో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మరో చోట..కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం (krsihna District Gudlavalleru) వడ్లమన్నాడు గ్రామం వద్ద ఆదివారం ఉదయం టిప్పర్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గుడ్లవల్లేరు నుంచి పెడన మండలం జింజెరు గ్రామానికి కూలీలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు జింజెరు గ్రామానికి చెందిన జన్ను నాంచారయ్య, జన్ను వెంకన్న, మోటుకురు శివలుగా పోలీసులు గుర్తించారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో జింజెరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.