BJP leader Daggubati Purundeswari

BJP Appoints New State Chiefs: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగతంగా బీజేపీ(BJP) కీలక మార్పులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు పార్టీ నూతన అధ్యక్షులను నియమించింది.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ... చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం

స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి.. చెన్నైలో ఏప్రిల్‌ 22, 1959లో జన్మించారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి 14వ లోక్‌సభకు .. 2009లో విశాఖ నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు.

ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో పురందేశ్వరి బీజేపీలో చేరారు. బీజేపీలో మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీకు ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పురందేశ్వరికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.

గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసింది. 2014లో బీజేపీలో చేరి.. రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు.ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలకుగానూ ‘‘దక్షిణాది సుష్మా స్వరాజ్’’ బిరుదును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బీజేపీ జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉన్నారు.