Nellore, June 2: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి.. నేడు నామినేషన్ దాఖలు (Mekapati Vikram Reddy files nomination) చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్‌కు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్‌గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. విక్రమ్ రెడ్డి నామినేషన్ అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు గెలుపునిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని, ఇప్పుడు ఆయన అడుగు జాడల్లోనే విక్రమ్ రెడ్డి నడుస్తున్నారని ఆయన తెలిపారు.కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలో (Atmakur By Poll 2022) టీడీపీ వైఖరిపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో లేదని ఆయన ప్రకటించారు. పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరిగే ఎన్నికల్లో మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని ఆయన చెప్పారు. దీనికి తమ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఆయన తెలిపారు.
ఈ సంప్రదాయాన్ని గౌరవించి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయరాదని నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు.ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా బద్వేల్‌లో టీడీపీ ఎందుకు పోటీ చేయలేదో.. అదే కారణంతోనే ఆత్మకూరులోనూ పోటీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. చనిపోయిన నేత కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఏనాడూ పోటీ చేయదని చంద్రబాబు స్పష్టం చేశారు.