Tadipatri, Feb 27: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యువతను ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం పట్ల 188, 171–ఇ–హెచ్, సెక్షన్ల కింద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు (Case Files against JC Prabhakar Reddy) నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా క్రికెట్ కిట్లను పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పలు సెక్షన్ల కింద మాజీ ఎమ్మెల్యే జేసీ, అతని సమీప బంధువు గౌరీనాథ్‌రెడ్డిపై పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు.
గత గురువారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో జేసీ (EX TDP MLA JC Prabhakar Reddy) సమీప బంధువు, టౌన్‌బ్యాంకు ఉద్యోగి గౌరీనాథ్‌రెడ్డి పెంట్‌హౌలో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. జేసీ, స్పర్శ పేరుతో ముద్రించి కిట్లను సిద్ధం చేయించారు. ముందస్తు సమాచారంతో పట్టణ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐలు రామకృష్ణ, ప్రదీప్‌కుమార్, మహిళా ఎస్‌ఐ లక్ష్మి, సిబ్బంది బృందావనం అపార్ట్‌మెంటు పైభాగంలో గురువారం రాత్రి తనిఖీలు చేపట్టారు.
అప్పటికే పంపిణీ చేయగా మిగిలిన క్రికెట్ కిట్లను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కిట్లు ఉంచిన గదికి తాళం తీసేందుకు పోలీసులు రెండు గంటలకుపై శ్రమించాల్సి వచ్చింది. రాత్రి 8 గంటలకు పెంట్‌హౌస్‌కు చేరుకున్న పోలీసులు అతి కష్టంపై 11 గంటల సమయంలో గది తాళాలను తెరవగలిగారు.