Vjy, Sep 1: ఏపీ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు (CBI Court)లో ఊరట లభించింది. యూకేలో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు విదేశాలకు వెళ్లడానికి అనుమతిలివ్వాలంటూ జగన్ పిటిషన్‌ను పెట్టుకున్నారు. తాను తన కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. బుధవారం పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని గురువారం నాటికి వాయిదా వేసింది.
గురువారం కోర్టు వేళలు ప్రారంభం కాగానే పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు న్యాయమూర్తులు సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అదే మాదిరిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
ఊరట నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వచ్చారు. సీబీఐ కోర్టుకు గతంలో అప్పగించిన తన పాస్ పోర్టును తీసుకుని వెళ్లారు. నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నిన్న అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన పాస్ పోర్టును తీసుకున్నారు. యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం తాను విదేశాలకు వెళ్తున్నట్టు కోర్టుకు విజయసాయి తెలిపారు. అమెరికా, యూకే, దుబాయ్, జర్మనీ, సింగపూర్ దేశాల్లో పర్యటించేందుకు ఆయనకు కోర్టు అనుమతిని ఇచ్చింది.