Polavaram Project (photo-Video Grab)

New Delhi, July 24: పోలవరంపై పార్లమెంటు (Parliament) సాక్షిగా కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం అంటూ తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ తొలిదశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ. 12,911 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా జవాబు చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ తొలిదశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిలువ చేసేందుకు 10 వేల 911.15 కోట్ల రూపాయలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్‌ 5న తెలిపిందని పేర్కొన్నారు. పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు.

ఇకపై అమరావతి మనందరి అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన

కాగా పోలవరం తొలిదశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ. 17,144 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత జూన్‌ 5న తమకు ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి తెలిపారు. వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

అయితే ఈ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించి మార్చి 15, 2022న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణం 10 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జూలై 15, 2022న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణలోకి తీసుకున్న పిమ్మటే మొత్తం 12,911 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.

మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు ఖర్చును భరించేందుకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం తెలపలేదు. 10 వేల 911 కోట్లు చెల్లించేందుకు ఆర్థికశాఖ అంగీకరించింది. వరదల కారణంగా జరిగిన నష్టం కింద మరో 2 వేల కోట్లు చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే ఈ ప్రతిపాదనల్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంది.

ఇప్పటిదాకా ఉన్న కాలక్రమం ప్రకారం 2024 జూన్‌ కల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. కానీ 2020-2022 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది.