National Highway (Representational Image)

Vjy, Dec 19: తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి (National Highway Between TS-AP) కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీ రాష్ట్రంలోని వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు (Telangana Kalwakurthy to Andhra Pradesh Jammalamadugu) వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. దాదాపు రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు.రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అలాగే రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ కూడా తాజాగా చేపట్టింది.

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే 255 కి.మీ. రహదారి(ఎన్‌హెచ్‌167కె)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కి.మీ.రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ ఆమోదం, రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కొత్త జాతీయ రహదారి నిర్మాణం

ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్‌ను తాజాగా ఖరారు చేశారు. మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.