Amaravati, April 20; టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న విషయం తెలిసిందే. తన జన్మదినం (Chandrababu Birthday) సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆయన (Telugu Desam Party Chief) మీడియాతో మాట్లాడుతూ... 'అందరికీ నమస్కారం.. ఈ రోజు నేను ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నాను. ఇంతకు ముందు వేంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుని ఇక్కడకు వచ్చాను.
మళ్లీ నాకు శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని దేవుళ్లను కోరుకున్నాను. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యలను దూరం చేసేలా పోరాడే తెలివి తేటలు నాకు ఇవ్వాలని కోరుకున్నాను. తెలుగు జాతికి మళ్లీ పునర్ వైభవం వచ్చేలా చూడాలని దుర్గమ్మను కోరుకున్నాను. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడను. నేను ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేయడానికి దుర్గమ్మను కోరేందుకు వచ్చాను. టీడీపీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పోరాడుతుంది. ప్రపంచంలో తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా నన్ను అభిమానిస్తున్నారు.. జన్మదినోత్సవం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను' అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
తన పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని చెప్పారు. కాగా, ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు వెంట బుద్ధా వెంకన్న సహా పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఆయనతో కలిసి అక్కడి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. ఏపీలోని జిల్లాల్లో తన పర్యటనపై పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు చర్చించనున్నారు.