Vjy, June 6: ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులోని లేని వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్రంలో మంత్రివర్గ కూర్పు.. టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరుకానున్నారు. వీడియో ఇదిగో, నరేంద్ర మోదీ నివాసంలో ముగిసిన ఎన్డీయే కూటమి సమావేశం, పూర్తిస్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు వార్తలు
ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించానని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.