Davos, May 26: దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు నాలుగో రోజు సమావేశాల సందర్భంగా యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈవోలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) తెలిపారు. విశాఖను యూనికార్న్ స్టార్టప్ (సుమారు రూ.7,700 కోట్ల విలువ చేరుకున్నవి) హబ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రేయ, ఆన్‌లైన్ లెర్నింగ్ సంస్థ బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుష్మిత్ సర్కార్, ఇండియాలో క్రిప్టో కరెన్సీ లాంటి సేవలు అందిస్తున్న కాయిన్‌స్విచ్ కుబేర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో ఆశిష్ సింఘాల్, పర్యాటక బుకింగ్ పోర్టల్ ఈజ్‌మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు.. సతీష్ జయకుమార్, ఆన్‌లైన్ లెర్నింగ్ సంస్థ కొర్‌సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్‌తో ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan Davos Tour) సమావేశమై రాష్ట్రంలో స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు.
విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, మీ అందరికీ నగరం ఆహ్వానం పలుకుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. వనరులు సమకూర్చడం, విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం వారితో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పి బైజూస్ పాఠ్యప్రణాళికను రాష్ట్ర విద్యార్థులకు అందిస్తామని బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుష్మిత్ సర్కార్ వెల్లడించారు. రాష్ట్ర విద్యారంగానికి తోడ్పాటు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే, రికార్డులను భద్రపరచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై కాయిన్‌స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ సింఘాల్‌తో సీఎం జగన్ చర్చించారు. సర్వే రికార్డులు నిక్షిప్తం చేయడంపై సహకారం అందిస్తామని సింఘాల్ తెలిపారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి చేయూత అందించి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా సహకారం అందిస్తామని ఈజ్‌మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి సీఎంతో సమావేశం సందర్భంగా పేర్కొన్నారు.