Amaravati, Nov 21: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 66,002 నమూనాలు పరీక్షించగా 1,221 పాజిటివ్ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య8,59,932 కు చేరింది. కొత్తగా పది మంది కరోనా బాధితులు (Covid Deaths) మృతి చెందడంతో ఆ సంఖ్య 6,920 కి చేరింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,829 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,382యాక్టివ్ కేసులు ఉన్నాయి.
12 ఏళ్లకు ఓ సారి వచ్చే తుంగభద్ర పుష్కరాలు (Tungabhadra Pushkaralu) ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భక్తుల మనోభావాలకు అనుగుణంగా..లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానమాచరించే ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు లేకుండా, శాస్త్రోక్తంగా ప్రారంభించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.
Here's AP CMO Tweet
పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ, సారె సమర్పించి హారతి ఇచ్చారు. అనంతరం సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 20, 2020
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కర్నూలులోని ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు వచ్చారు. పట్టుపంచె, తెల్లచొక్కా ధరించి సంప్రదాయ వస్త్రధారణలో సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున తుంగభద్రమ్మకు సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చేతుల్లో పెట్టుకుని ముందుకు కదలగా, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రిని నది వరకు తీసుకొచ్చారు.
నది ఒడ్డున ఉన్న తుంగభద్రమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. దేవగురువు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించగానే సరిగ్గా మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు తుంగభద్రలోకి ప్రవేశించాడు. పుష్కరుడిని నదిలోకి ఆహ్వానిస్తూ పండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి ‘స్వాగత పూజ’ చేశారు. పుష్కరుడి ప్రవేశానంతరం నదీ జలాలకు పండితులు విశేషమైన ఉపచార పూజలు చేశారు. అనంతరం సీఎం పట్టువస్త్రాలను సమర్పించారు. వేద పండితులు పంచహారతులిచ్చారు. ముఖ్యమంత్రి కూడా తుంగభద్రమ్మకు హారతినిచ్చి పూజలు చేశారు. పుష్కరుడి రాక తర్వాత అపూర్వ, విశేషమైన శక్తిని సంతరించుకున్న పుష్కర జలాన్ని సీఎం వైఎస్ జగన్ శిరస్సుపై ప్రోక్షించుకున్నారు.
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది (Tungabhadra Pushkaram is a festival of River Tungabhadra) వెంబడి 23 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. అన్ని ఘాట్లలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. మంత్రాలయంలో మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థులు నదిలోకి వెళ్లి పుష్కరస్నానం ఆచరించారు. పుష్కరాల కోసం సప్తనదులైన గంగ, యమున, సరస్వతి, కావేరి, నర్మద, సింధూ, గోదావరి నుంచి తీసుకొచ్చిన జలాలను తుంగభద్రలో కలిపారు. తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేశారు.