Amaravathi, April 18: ఆంధ్ర ప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 38 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈరోజు ఉదయం నాటికి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 572 కు చేరింది. ఇందులో ఇప్పటివరకు 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 523 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కర్నూలు జిల్లాలో ఒక్కరోజులోనే కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 6 కేసులు కూడా ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేట్ డాక్టర్ కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. వీరితో పాటు కర్నూలులోని సర్వజన హాస్పిటల్ లో పనిచేసే ఓ మహిళా డాక్టర్ కు కూడా కరోనావైరస్ సోకింది. దీంతో కర్నూలు జిల్లా నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 126 కు చేరింది.
మరోవైపు గుంటూరులో కొత్తగా మరో 4 కేసులు నమోదు కావడంతో ఈ జిల్లాలో కూడా కేసుల సంఖ్య కర్నూలుతో సమానంగా 126కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం 572 కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచే అత్యధికంగా 252 ఉన్నాయి. అంటే రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 44 శాతం ఈ రెండు జిల్లాల నుంచే ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు
మరోవైపు కమ్యూనిటీ టెస్టింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంది. దీంతో ఏపీలో వైరస్ నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరగనుంది. వీటి ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే ఫలితం తేలనుంది. వీటిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ముందుగా తానే ఈ కిట్ ద్వారా కరోనావైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో ఒకరోజులోనే 2,200 నుంచి 10 వేల వరకు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చునని అంచనా.
మరోవైపు గుంటూరు, తెనాలి, మాచర్ల, నరసరావుపేటల ప్రాంతాల్లో ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా రోజు 360 కరోనా పరీక్షా ఫలితాలు రానున్నాయి. ప్రస్తుతం గుంటూరు మెడికల్ కళాశాల ల్యాబ్‌లో 200 కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉండగా, దాని సామర్థ్యాన్ని 400కు పెంచే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు.