Amaravati, Dec 31: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా కొవిడ్ నిబంధనల మధ్యే కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు (Andhra Pradesh prohibits public New Year festivities) విధించారు. ఇవాళ రాత్రి విజయవాడలో వేడుకలకు అనుమతి లేదని కమిషనర్ క్రాంతి రాణా స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12గంటల వరకు మాత్రమే ఇండోర్ వేడుకలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్లపై ఎవరూ తిరగకూడదంటూ హెచ్చరించారు. బెజవాడలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
న్యూ ఇయర్ వేడుకలు (New Year festivities) రోడ్లపై చేస్తే కుదరదని సీపీ తెలిపారు. రోడ్లపై ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. అలాగే క్లబ్‌లు, రెస్టారెంట్లలో 60 శాతం ఆక్యుపెన్సీతోనే వేడుకలు జరపాలని ఆదేశించారు. వీటికోసం రెస్టారెట్లు, క్లబ్‌లు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. డీజేలు, భారీ స్పీకర్లకు అనుమతి లేదు. నగర వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ప్రధాన రహదారులైన బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్టీఎస్రోడ్లలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయి. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్, పీసీఆర్ ఫ్లై ఓవర్‌లపై ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఇటు విశాఖ బీచ్ రోడ్డులో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలపై నిషేధం విధించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, బీఆర్‌టీఎస్ సెంటర్ లైన్ రోడ్ మూసివేయనున్నారు. నగరంలో కేక్ కటింగ్‌లు, డీజేలపై కూడా నిషేదాజ్ఞలు జారీ చేశారు.
నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకు బార్లు తెరుచుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్రోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది. ఈ మేరకు ఏపీఎస్బీసీఎల్ ఎండీ నుంచి అన్ని డిపోల మేనేజర్లకు గురువారం అర్థరాత్రి సందేశాలు అందాయి.