Amaravati, Oct 5: ఏపీలో అక్టోబర్ 16 నుంచి రైతుల వద్ద నుండి పంటను ప్రభుత్వం కొనుగోలు (crops purchase from Farmers) చేయనుంది. ప్రస్తుతం మొక్కజొన్న, సజ్జ, రాగుల పంటల ఉత్పత్తులు చేతికందివస్తున్న తరుణంలో వ్యాపారుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను (Crop Purchase in AP) ఏర్పాటు చేసి మొక్కజొన్న, సజ్జ, రాగుల ఉత్పత్తుల సేకరణ ఈ నెల 16 నుంచి చేపట్టనుంది. దీనిపై రైతు భరోసా కేంద్రాల(RBK)లోని వ్యవసాయ సహాయకులను కలసి ఈ నెల 15లోగా పేర్లను నమోదు చేసుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.
రైతులు తమ పంటల వివరాలను ఈ–కర్షక్‌లో నమోదు చేసుకుంటేనే మద్దతు ధర పొందడానికి వీలవుతుంది. రైతులకిచ్చిన మాట మేరకు సీజన్ ప్రారంభం కాకముందే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 24 పంటలకు మద్దతు ధర వర్తించేలా నిర్ణయం తీసుకుని, వాటి ధరలకు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది
మొక్కజొన్నకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,850 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించగా.. మార్కెట్‌లో ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,400 వరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే సజ్జలు క్వింటాలుకు ప్రకటించిన మద్దతు ధర రూ.2,150 ఉంటే మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,500కు మాత్రమే కొంటున్నారు. రాగులకు మద్దతు ధర రూ.3,295గా ఉంటే మార్కెట్ ధర రూ.2,600 మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆలంబనగా నిలిచేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఈ నెల 16వ తేదీ నుంచే ఈ పంటల సేకరణ ప్రారంభించాలని నిర్ణయించింది. కాగా, మొక్కజొన్న, సజ్జలు, రాగులకు సంబంధించి ఒకో రైతు నుంచి గరిష్టంగా 100 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని, ఐదెకరాల విస్తీర్ణం కలిగిన రైతు వరకు ఈ పంటలను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో (Farmer Assurance Centers) ఈ నెల 1 నుంచే రైతుల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. రైతులు సాగుచేసిన పంట, సాగు విస్తీర్ణం, రానున్న దిగుబడి తదితర వివరాలు వీటిల్లో ఉంటున్నాయి. అంతేగాక పేర్లను నమోదు చేసుకున్న రైతులను ఏఏ తేదీల్లో పంటలను ఏయే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలో ముందుగానే తెలియపరిచే ఏర్పాటు చేశారు. వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపే ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కోవిడ్–19 నేపథ్యంలో సహకార బ్యాంకులు, సంఘాలు రైతులకు స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ (వినిమయ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. గతంలో ఇచ్చిన రుణం కాకుండా అదనంగా మరికొంత రుణవసతి ఈ బ్యాంకులు కల్పిస్తున్నాయి. సకాలంలో రుణాలు చెల్లించిన ట్రాక్ రికార్డు కలిగిన రైతులు, బ్యాంకులో రుణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. 8 శాతం వడ్డీ రేటుతో ఏడాదికాలంలో రుణం చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుతం వరి కోతకు వచ్చిన సమయం కావడంతో రైతుకు ఖర్చులకు, ఇతర పంటల రైతులకు వాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చారు. ఈ తరహా రుణం గతంలో ఎప్పుడూ ఇవ్వకపోవడంతో రైతులకు అవగాహన కలిగించేందుకు సహకార బ్యాంకులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రుణాలు ఇవ్వడానికి రాష్ట్రంలో 2,030 ప్రాథమిక సహకార సంఘాలు, బ్యాంకులకు ఆప్కాబ్ రూ.1,300 కోట్లు కేటాయించింది. సంఘాలు తమ పరిధిలోని రైతుల అవసరాలు, వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ రుణాలను ఇస్తున్నాయని ఆప్కాబ్ అధికారులు తెలిపారు.