Amaravati, May 3: ఏపీ హైకోర్టు వ్యభిచార అంశానికి సంబంధించి కీలక తీర్పునిచ్చింది. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడు కస్టమర్ (Customer of sex workers) అని, న్యాయస్థానంలో అతడినెలా విచారిస్తారని ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అతడిపై పెండింగులో ఉన్న కేసును కొట్టివేసింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2020లో గుంటూరు చెందిన వ్యక్తిపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందుకు సంబంధించి గుంటూరులోని మొదటి తరగతి జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు (ప్రత్యేక మొబైల్ కోర్టు)లో అతడిపై కేసు పెండింగులో ఉంది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తనపై పెండింగులో ఉన్న కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. అతడి తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ 10 అక్టోబరు 2020న తన క్లయింటుపై పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారని చెప్పారు. వ్యభిచార గృహంపై దాడిచేసినప్పుడు తన క్లయింట్ కస్టమర్‌గా ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు.
వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారిపైనా, ఆ ఇంటిని వ్యభిచారం నిర్వహించడం కోసం ఇచ్చిన వారిపైనా కేసు పెట్టి విచారించవచ్చని, కానీ డబ్బులు చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని ఎలా విచారిస్తారని (not liable for prosecution), చట్టంలోని నిబంధనలు కూడా విచారించకూడదనే చెబుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును గతంలో ఇదే కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ కస్టమర్ మాత్రమేనని తెలిపారు. వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ దిగువ కోర్టులో పిటిషనర్‌పై ఉన్న కేసును రద్దు చేస్తూ తీర్పు వెల్లడించారు.